కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఈ ప్రాజెక్టు విషయంలో బీజేపీపై విషప్రచారం జరుగుతోందని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా మాట్లాడారని.. అదే బీజేపీ వైఖరి అని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంతో పని లేకుండా కేంద్రమే నేరుగా సీబీఐతో విచారణ చేయించే అవకాశముంటే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఈపాటికే కేసీఆర్, కేటీఆర్‌ను జైలులో వేసే వాళ్లమని సంజయ్ అన్నారు.
ఆదివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్‌రెడ్డి సర్కారే రక్షణ కవచంగా ఉంటోందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో సీబీఐ విచారణ జరపాలని రాహుల్‌గాంధీ చెప్పిన మాటలేమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని చెప్పారు.
రూ.38 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్షా 20 వేల కోట్లకు అంచనాలు పెంచిన కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి కొందరు అధికారులనే బలి చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు.