రాష్ట్రంలో పెరుగుతున్న ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. త్వరలోనే జగనన్న ఉల్లి వారోత్సవాలు నిర్వహించాల్సిన రోజులు దగ్గరపడ్డాయంటూ ట్వీట్ చేశారు. కూరగాయల ధరలు జెట్ స్పీడుతో దూసుకెళుతున్నాయని తెలిపారు. జగన్ గారి విధ్వంసక పాలన పుణ్యమాని అసలు పనులే లేవనుకుంటే ఇప్పుడు అప్పు చేసి పూట గడుపుకునే పరిస్థితి కూడా లేకుండాపోయిందని విమర్శించారు.
సీఎం జగన్ గారి ఆస్తుల్లా నానాటికీ ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రూ.500 కూలీ కూడా వదులుకుని కేజీ ఉల్లిగడ్డల కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని పేర్కొన్నారు. ఓ ప్రణాళిక అంటూ లేకుండా సాగుతున్న జగన్ గారి పాలనతో మహిళలు పనులు కూడా మానుకుని గంటల తరబడి క్యూలలో నిలబడక తప్పడంలేదని ట్వీట్ చేశారు.


