telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంకో టెస్ట్ ఓడితే కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవాల్సిందే…

gambir praised kohli on winning series

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాల్సిందేనని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో 227 పరుగుల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడటంతో విరాట్‌ కోహ్లీ సారథ్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోహ్లీ అనాలోచిత నిర్ణయాలే భారత జట్టు ఓటమికి కారణమని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ఓటమిపై స్పందించిన మాంటీ పనేసర్.. కెప్టెన్‌గా కోహ్లీకి దగ్గరపడిందన్నాడు. ‘విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ గ్రేటేస్ట్ బ్యాట్స్‌మన్. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ సారథిగా అతను విఫలమవుతున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ వరుసగా నాలుగు టెస్ట్‌ల్లో ఓడింది. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ గైర్హాజరీలో రహానే రాణించడంతో అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో భారత్ మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం విరాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఖచ్చితంగా తప్పుకుంటాడు.’అని ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ‘డబుల్‌ సెంచరీ’ చేసిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ అవకశాలను భారత్ సంక్షిష్టం చేసుకుంది.సుదీర్ఘ ఫార్మాట్‌ కెప్టెన్సీలో విరాట్‌ కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు. ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్ తర్వాత అత్యధిక గెలుపు శాతం సాధించిన సారథి కోహ్లీనే. అయితే విరాట్‌ వరుసగా గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టు, చెన్నై వేదికగా జరిగిన ఇంగ్లాండ్ టెస్టులో పరాజయాన్ని చవిచూశాడు. అయితే కెప్టెన్సీలో కోహ్లీ వరుసగా నాలుగు టెస్టుల్లో ఓటములు చవిచూడటం ఇదే ప్రథమం. అంతకుముందు అతడు వరుసగా ఏడు టెస్టుల్లో విజయం సాధించడం గమనార్హం.

Related posts