telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇసుక రవాణాపై .. నిఘా పెంపు..

ap govt an eye on sand transport

ప్రభుత్వం ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించకుండా అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇసుక అక్రమంగా తరలించే మార్గాలపై దృష్టిపెట్టి ఆయా ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో నిఘా కేంద్రాలు(చెక్‌పోస్టులు) ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హైదరాబాద్‌, తెలంగాణ జిల్లాలకు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి బెంగళూరు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు అధికంగా వెళ్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఈ జిల్లాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టిపెట్టింది. ఆయా జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అన్ని మార్గాలపై నిఘా పెడుతున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై సైతం చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఏర్పాటు చేయగా, మరికొన్ని అదనంగా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 70 వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

అనంతపురం జిల్లాలో ఇప్పటికే 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, తాజాగా మరో 14 సిద్ధం చేస్తున్నారు. పంచాయత్‌రాజ్‌శాఖ ద్వారా చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది విధులు నిర్వహించేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది. అలాగే వీటివద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు పెరగడంతో, నిల్వ కేంద్రాల్లో ఎక్కువ ఇసుకను అందుబాటులో ఉంచుతున్నారు. గురువారం అన్ని రీచ్‌ల్లో కలిపి 1.15 లక్షల టన్నుల ఇసుక తవ్వితీశారు. పాత నిల్వతో కలిపి శుక్రవారం 1.89 లక్షల టన్నులు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో 41,899 టన్నులు సాధారణ అవసరాల కోసం బుక్‌ చేసుకోగా, 31,391 టన్నులు బల్క్‌ అవసరాలు ఉన్నవారికి కేటాయించారు.

Related posts