రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్డున్ రెడ్డి పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అమరావతిలో జరిగిన రాజంపేట టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించారు. మేడా మల్లికార్డున్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజంపేట కార్యకర్తలు ఏకగ్రీవంగా చంద్రబాబును కోరారు. ఈ మేరకు స్పందించిన చంద్రబాబు మేడను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మేడా మల్లికార్డున్ రెడ్డి చంద్రబాబు ఏర్పాటు చేసిన రాజంపేట నియోజకవర్గం పార్టీ నేతల సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలనున్నారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో భేటీ అనంతరం మేడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.