telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తి, ఈరోజు రాత్రి విజేత పేరు ప్రకటిస్తారు

హైదరాబాద్ నగరం ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలకు సిద్ధమైంది. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఈ ఏడాది ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

ఈరోజు హైటెక్స్ ప్రాంగణంలో జరిగే గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.

గత ఐదు రోజులుగా జరుగుతున్న అంతర్గత పోటీల అనంతరం 109 మంది పార్టిసిపెంట్లలో 40 మంది క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారని జయేష్ రంజన్ తెలిపారు.

ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఈ 40 మంది మధ్య సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయని, చివరికి ఎనిమిది మంది తుదిపోటీలో నిలుస్తారని వివరించారు.

బయటి నుంచి వచ్చే ప్రత్యేక న్యాయనిర్ణేతలు ఈ ఎనిమిది మందిని ప్రశ్నించి, వారి ప్రతిభ ఆధారంగా విజేతను ఎంపిక చేస్తారని ఆయన అన్నారు.

రాత్రి సుమారు 9:15 గంటలకు కొత్త మిస్ వరల్డ్ 2025 విజేత పేరును ప్రకటిస్తారని జయేష్ రంజన్ పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సంస్థ ఛైర్పర్సన్ జూలియా మోర్లే, ప్రస్తుత మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్) సంయుక్తంగా నూతన ప్రపంచ సుందరికి కిరీటాన్ని అలంకరిస్తారు.

వీరితో పాటు మరో ఐదు ఖండాలకు చెందిన కాంటినెంటల్ విజేతలను కూడా ఇదే వేదికపై ప్రకటిస్తారని ఆయన తెలిపారు.

Related posts