తెలంగాణ సీఎం కేసీఆర్ ను తెలంగాణ భవన్‌లో ఏపీ పర్యాటక, క్రీడలు, యువజన శాఖల మంత్రి ఆర్కే రోజా కలిసారు. మంత్రి పదవిలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా.. సీఎంతో పలు అంశాలపై చర్చించారు.
ఏపీ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాను.. కేసీఆర్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటాన్ని సీఎంకు రోజా బహుకరించారు.

కేసీఆర్‌తో సమావేశం అనంతరం బయటకు వచ్చిన రోజా.. కేటీఆర్ వ్యాఖ్యలుపై స్పందించారు.. ఏపీ గురించి కేటీఆర్ మాట్లాడలేదు అనుకుంటున్నా.. పొరుగు రాష్ట్రం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటానన్నారు. ఒకవేళ ఏపీ గురించి మాట్లాడి వుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఏపీలో జరిగిన అభివృద్ధి , సంక్షేమం మరో రాష్ట్రంలో వుందా అని రోజా ప్రశ్నించారు.
ఏపీలో సీఎం వైఎస్ జగన్ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. కేటీఆర్ ఏపీకి వస్తే దగ్గర ఉండి అభివృద్ధి చూపిస్తానన్నారు.. తమిళనాడు వాళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ సచివాలయాలను తీసుకువచ్చారు.. అవినీతికి తావు లేకుండా పథకాలు అందుతున్నాయని తెలిపారు.
కేటీఆర్ కి చెప్పిన ఫ్రెండ్ ఎవరో.. తప్పుగా చెప్పరని భావిస్తున్నానని.. ఏపీకి వస్తే కేటీఆర్.. తెలంగాణలో ఇలాంటి పనులు చేయాలని అనుకుంటారని.. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పథకాలకు అందిస్తున్నాం అని వెల్లడించారు.

ఇక, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయి.. ఎవరో చెప్పిన వాళ్ల మాటలు విని మాట్లాడితే ఆంధ్రా వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయని వెల్లడించారు.
సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్న రోజా.. మంత్రి అయ్యాక కుటుంబసభ్యులతో కలిసి ప్రగతిభవన్‌కు రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిపారు.


