రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్‌గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకుంటూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం సాయంత్రం మీడియాలో వైరల్‌గా మారింది. టీఆర్ఎస్ పార్టీ ఛానల్‌గా గుర్తింపు ఉన్న న్యూస్ ఛానల్ లో కూడా ‘‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జారోగం’’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది.
							previous post
						
						
					
							next post
						
						
					

