ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
ప్రస్తుతం 1,08,900 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ.. 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 75,000కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఉద్యోగ కోతలు లేఆఫ్‌లు, సహజ విరమణలు, ఇతర చర్యల ద్వారా జరుగుతాయని కంపెనీ నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంటెల్ ఇప్పటికే సుమారు 15 శాతం (సుమారు 15,000) ఉద్యోగాలను తగ్గించింది. గత ఏడాది కూడా 15,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తొలగించడం గమనార్హం.
2024 రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ ఇంటెల్ ఈ లేఆఫ్‌లను ధ్రువీకరించింది. కంపెనీ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
ఇందులో తాజా తగ్గింపులకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ఖర్చులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, త్రైమాసిక ఆదాయం 12.9 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
ఇది మార్కెట్ అంచనాలను అధిగమించడం విశేషం.
ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం 12.6 బిలియన్ డాలర్ల నుంచి 13.6 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని, సగటున 13.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇంటెల్ అంచనా వేస్తోంది.
ఇది విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువ కావడం కొంత సానుకూల అంశం.
ఒకప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఇంటెల్ ఇటీవలి సంవత్సరాలలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.
1990లలో పర్సనల్ కంప్యూటర్ బూమ్ సమయంలో మైక్రోప్రాసెసర్ వ్యాపారంలో ఆధిపత్యం వహించినప్పటికీ ఆ తర్వాత వెనుకబడిపోయింది.
ప్రస్తుతం ఎన్‌విడియా వంటి కంపెనీలు నాయకత్వం వహిస్తున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) చిప్ విభాగంలో కూడా ఇంటెల్ వెనుకబడి ఉంది.