26 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా 19 ఏళ్ల అబ్బాయితో ప్రేమలో పడింది. అతడు చెప్పిన మాటలు నమ్మి అతడికి దగ్గరైంది. చివరకు పెళ్లి చేసుకున్న అనంతరం ఆమెను అబ్బాయి వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాధిత యువతి తన భర్త ఇంటి ముందు దార్నాకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేదిలేదని తెగేసి చెప్పింది. కర్నూలు జిల్లా నందవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నందవరానికి చెందిన యువకుడు ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఫేస్ బుక్ లో అతడికి వరంగల్ జిల్లాకు చెందిన యువతితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. కూకట్‌పల్లిలో ఉంటోన్న తన వద్దకు వచ్చిన ఆ యువకుడు ఈ నెల 4న హైదరాబాద్‌లో తనను వివాహం చేసుకున్నాడని ఆమె చెప్పింది. తన ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను కలిసి వస్తానని చెప్పి వెళ్లి అతడు మళ్లీ రాలేదని వివరించింది.