telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

8న కార్మిక లోకం దేశవ్యాప్త సమ్మె.. పిలుపునిచ్చిన సిఐటియు …

citu india wise protest on 8th

ఇటీవల పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులను బానిసలుగా మార్చేలా కార్మిక చట్టాల సవరణలకు పూనుకున్న మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా జనవరి 8న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సమ్మెను విజయంతానికి డిసెంబర్‌ 26న అనంతపురంలో ప్రారంభమైన ప్రచార జాతా మంగళవారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక చుట్టుగుంట సెంటర్‌లో కార్మికులు, సిఐటియు, ఎఐటియుసి, ఎల్‌ఐసి, మెడికల్‌ రిప్రజెంటెటీవ్‌, పోస్టల్‌ తదితర ఫెడరేషన్ల నాయకులు జాతాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గాంధీపార్కు వరకూ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సభలో ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికులకు, ప్రజలకు అన్యాయం చేస్తూ అంబానీ, అధానీ, నిరవ్‌మోడీ వంటి పెద్ద పెద్ద కుబేరులకు కొమ్ముకాస్తుందన విమర్శించారు.

కనీస వేతనం రూ.21 వేలు (రోజుకు రూ.700) కోరుతుంటే కేంద్ర మంత్రి మాత్రం రోజుకు రూ.173 సరిపోతుందని ప్రకటించటం అన్యాయమన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ, ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదని, పకోడీలు అమ్ముకోవటం కూడా ఉద్యోగమేనని చెబుతున్నాడని మండిపడ్డారు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరోవైపు రూ.1.46 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు రుణాలు రద్దు చేశారని విమర్శించారు. ఎఐటియుసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్‌.టి వంటి విధానాలతో దేశ ఆర్ధికాభివృద్ధి కుంటుబడిందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎన్‌ఆర్‌సి, సిఎఎ పేరుతో విధ్వంసంసృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. బ్యాంకుల విలీనంతో పెద్ద పెద్ద కార్పొరేట్లకు సులభంగా బ్యాంకు రుణాలు అందించేందుకు మోడీ చుర్యలు తీసుకున్నారన్నారు. ఈ విధానాలకు నిరసనగా జనవరి 8న జరిగే సమ్మెలో కార్మికులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ముజఫర్‌ అహమ్మద్‌, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సిఐటియు గుంటూరు తూర్పు, పశ్చిమ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కాకుమాను నాగేశ్వరరావు, గుంటూరు విజయకుమార్‌, ఎఐటియుసి జిల్లా ప్రధానకార్యదర్శి కాసా రాంబాబు, ఎల్‌ఐసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు వివికె సురేష్‌, ఆర్‌టిసి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి కె.గంగాధరరావు, సిఐటియు నగర తూర్పు, పశ్చిమ కమిటి అధ్యక్షు, కార్యద్శులు కట్లగుంట శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు పాల్గొన్నారు.

Related posts