telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఫేస్‌బుక్ సీఈవో సంపద రూ.52 వేల కోట్లు ఆవిరి

సోమవారం కొన్ని గంటలపాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ స్తంభించి పోవడంతో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) తరిగిపోయింది. దీంతో ఆయన బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో మూడు నుంచి 5వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 122 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఫేస్‌బుక్‌లో సమస్యలు తలెత్తాయన్న వార్తలు బయటకు తెలియగానే సంస్థ షేర్లు 5శాతం మేర పడిపోయాయి. దీంతో గతనెల మధ్య నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే నిన్న అనేక కంపెనీలు ఫేస్‌బుక్‌ నుంచి తమ ప్రకటనలను తొలగించాయి. ఈ నేపథ్యంలోనే జుకర్‌బర్గ్‌ సంపద తగ్గిపోయింది.

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రాత్రి 9 గంటల నుంచి స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీటిపై ఆధారపడిన కొన్ని కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక గంటల తరబడి నానా హైరానా పడ్డారు. కొందరు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాల వైపు దృష్టిసారించారు. దాంతో వాటికి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ఈ హఠాత్‌ పరిణామంపై ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ప్రకటించింది. అంతరాయంపై జుకర్‌బర్గ్‌
స్వయంగా క్షమాపణలు చెప్పారు.

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ ఐనా సమయంలో యూజర్ల డేటా అసలు లీక్‌ అవ్వలేదని ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. యూజర్ల డేటాకు డోకా లేదని వెల్లడించింది. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఫేస్‌బుక్‌ చర్యలను తీసుకుంటుందని తెలిపింది.

Related posts