రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌కు పలు గ్రామాల్లో పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేశ్, సైనిక్ స్కూల్ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, బాలురు బాలికల వసతి సముదాయాలు, క్యాంటీన్, మెస్ భవనాలను సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేశ్ చెంచురామ్‌తో కలిసి ప్రారంభించారు.
అంతకుముందు పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను కూడా మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు హాజరయ్యారు.
పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ పురందేశ్వరి, హితేశ్ చెంచురామ్, పాఠశాల సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
బాపట్ల జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి లోకేశ్‌కు జె.పంగులూరు, ఆరికట్లవారిపాలెం, గంగవరం వంటి గ్రామాల్లో పార్టీ శ్రేణులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు.
ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ, బాణసంచా కాల్చుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారిపొడవునా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన ఆయన, వారి సమస్యలను విని, పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ సైనిక్ స్కూల్, భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
పరారీలో ఉండాల్సిన అవసరం మా ఆయనకు లేదు: అఖిలప్రియ