2018 సంవత్సరానికిగాను 66వ జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఈ సందర్భంగా విజేతలని చిరంజీవి, రాజమౌళి, పవన్ కళ్యాణ్‌తో పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా అవార్డు విన్నర్స్కి శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిభావంతులని జ్యూరీ గుర్తిచింది. జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌తో పాటు మహానటి టీంకి అభినందనలు. అలానే రాహుల్ రవీంద్రన్, రంగస్థలం టీం తో పాటు నానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని కేటీఆర్ పేర్కొన్నారు. అలనాటి నటనాభినేత్రి సావిత్రి జీవిత కథతో రూపొందించిన “మహానటి” మూడు అవార్డులను గెలుచుకొని అగ్రభాగాన నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు, సినిమాలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా మహానటి పురస్కారాన్ని సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన రంగస్థలం ఉత్తమ ఆడియోగ్రఫీ, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చి॥ల॥సౌ ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో అవార్డులను సాధించాయి. అ! చిత్రం మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో పురస్కారాల్ని సాధించింది.

