టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ పరంగా భారత జట్టు బలంగా ఉందని అన్నాడు. వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుండగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోహ్లీతో పాటు జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వరల్డ్‌కప్ సన్నద్ధత వివరాలను వెల్లడించారు. కోహ్లీ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకం ఉంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా సన్నద్ధం కావడంపైనే ఇక మా దృష్టంతా.
ఐపీఎల్‌లో ఆడటం వల్ల అలసిపోలేదు. ఇంగ్లాండ్‌లో అధిక పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది. మా జట్టు ఆటపై ఫోకస్ పెట్టింది. ప్రపంచకప్‌లో ఒత్తిడి ఎదుర్కోవడం అత్యంత ముఖ్యమైనది. మా బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అందరూ తాజాగా ఉత్సాహంగా ఉన్నారు. ఎవరూ బలహీనంగా లేరు. డే-నైట్ మ్యాచ్ లేదా డే మ్యాచ్ అనేది పెద్ద విషయం కాదు. మంచి క్రికెట్ ఆడాలన్నదానిపైనే మా దృష్టి అంతా. అని వివరించాడు.
శాస్త్రి మాట్లాడుతూ..వరల్డ్‌కప్ లాంటి వేదికల్లో ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడాలి. మా సామర్థ్యం మేరకు రాణిస్తే కప్పు మన సొంతమవుతుంది. ఈ టోర్నీలో గట్టిపోటీ ఉంటుంది. 2015 కంటే బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ జట్లు చాలా బలమైన జట్లుగా అవతరించాయి.
మహేంద్రసింగ్ ధోనీపై స్పందిస్తూ.. ఈ టోర్నీలో ధోనీ పాత్ర చాలా కీలకం. ఈ ఫార్మాట్‌లో అతనికన్నా గొప్ప ఆటగాడు ఎవరూ లేరు. ముఖ్యంగా క్లిష్టపరిస్థితుల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే క్షణాల్లో అతడి అనుభవం చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతనొక గొప్ప క్రికెటర్ అని కొనియాడారు. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఆరంభంకానుంది.