ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ గతేడాది జనవరి 8న 105వ ర్యాంకులో ఉండగా, తాజా అద్భుత ప్రదర్శనతో ఈ ఏడాది జనవరి 8న ఏకంగా 3వ స్థానంలో నిలిచాడు సంచలనం రేపాడు. చివరి ఐదు టెస్టుల్లో అతడి పరుగులు 896 కావడం గమనార్హం. తాజా ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ జాబితాలో ఒక స్థానం మెరుగై కెరీర్ అత్యుత్తమ 3వ ర్యాంకు అందుకున్నాడు. అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా అతడికి దారివ్వక తప్పలేదు.
విరాట్ కోహ్లీ (928), ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్ (911) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. నయావాల్ పుజారా (791), అజింక్య రహానె (759) వరుసగా 6, 9వ ర్యాంకుల్లో నిలిచారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (814), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (793) 4, 5వ స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (794) ఆరో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అశ్విన్ (772), మహ్మద్ షమి (771) వరుసగా 9, 10వ ర్యాంకుల్లో నిలిచారు. ఆసీస్ పేసర్ కమిన్స్ (904), నీల్ వాగ్నర్ (852), జేసన్ హోల్డర్ (380) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తిరిగి టాప్-10లో ప్రవేశించాడు.