కర్ణాటకలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు విశ్వాస పరీక్షకు గడువు సమీపిస్తున్న తరుణంలో సంకీర్ణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చెబుతున్న బీజేపీకి మరింత ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే, కర్ణాటకలోని బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మొన్నటి వరకూ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని బీఎస్పీ ఎమ్మెల్యే మహేశ్ తాజాగా ప్లేట్ ఫిరాయించారు.
కాంగ్రెస్-జేడీఎస్ కు తన మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. దీంతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలినట్టయింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి సూచన మేరకే మహేశ్ తన మద్దతును ఉపసంహరించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 106. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ బలం 107 ఉంది. ఒకవేళ బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతు లభిస్తే ఆ సంఖ్య 108కి చేరుతుంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయే అవకాశం ఉంది.