నగరంలోని రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు అనుసరించాల్సిన వివిధ పద్ధతులపై అధ్యయనం నిర్వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు సమగ్ర నివేదికను రూపొందించి ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నగరంలోని రోడ్లు తరుచూ పాడవుతుండడంతో వాటిని ఎలాగైనా మెరుగుపర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇందులో భాగంగా జాతీయ రహదారుల తరహాలోనే నగరంలోని రోడ్లను కూడా నిర్వహించేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని ఇదివరకే మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై సమగ్ర నివేదికను రూపొందించారు. ముఖ్యంగా బీఓటీ(బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో అప్పగించే వీలుందని నివేదికలో పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న విధంగానే నగరంలోని రోడ్ల నిర్వహణకుగాను అయ్యే ఖర్చును ప్రభుత్వమే ఆయా ఏజెన్సీలకు చెల్లిస్తుంది.
రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతులు, ఎక్కడా గుంతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆయా ఏజెన్సీలపై ఉంటుంది. రోడ్ల ఏర్పాటుతోపాటు ఐదేండ్ల నిర్వహణ బాధ్యత(డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్)కూడా వారికే అప్పగించాలని ప్రతిపాదించారు. నగరంలో సుమారు 900 లేన్ కిలోమీటర్లమేర ప్రధాన బస్సు రహదారులు ఉండగా, అందులో మొదటి దశలో 600 లేన్ కిలోమీటర్లమేర ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. దీనికోసం ఏటా రూ.300కోట్ల చొప్పున ఐదేండ్లకు రూ.1500కోట్లు కేటాయించాలని నిశ్చయించారు. అంటే, ఒక్కో జోన్‌కు ఏటా రూ.50కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించడంతో దీనిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే టెండర్లు ఆహ్వానించి ఏదైనా బడా సంస్థకు రోడ్ల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. ప్రభుత్వమే ఈ ప్రతిపాదన చేసినందున త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.