కోనసీమ ఘటనలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితుడేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కోనసీమ ఘటన జరిగి ఇన్నాళ్లైనా ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే అనుమానాలు కలిగిస్తోందని తెలిపారు.
తనకు తెలిసినంత వరకు మంత్రి విశ్వరూప్ మంచి వ్యక్తి అని , ఆయన రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. కమ్మ, కాపు, బీసీ, మత్స్యకార కులాలను వైసీపీ శత్రువులుగా చూస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
వైసీపీ ఉన్నంతవరకు పోలవరం పూర్తి కాదని.. కొట్టడం తమ హక్కుగా వైసీపీ భావిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఉద్రిక్తతలు తగ్గాక కోనసీమలో పర్యటిస్తానని అన్నారు.
కోనసీమ తగులబడుతుంటే బస్సు యాత్ర చేస్తారా? అని ప్రశ్నించారు. ఘటనపై డీజీపీ స్పందించకుంటే కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని ప్రకటించారు.
ఏపీలో మళ్లీ వైసీపీ సర్కార్ వస్తే అరాచకమే. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఇక బీజేపీతో సంబంధాలపై పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా వ్యాఖ్యానించారు. తనకు ఢిల్లీ బీజేపీ నేతలతోనే సంబంధమని.. ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
మహానాడు సక్సెస్ అయితే మంచిదే అని అన్నారు. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకొస్తుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.


ప్యాకేజీలు తీసుకుని పవన్ చంద్రబాబుకు పనిచేస్తున్నారు: రోజా