telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

చప్పట్లు కొడితే చల్లని నీళ్లు.. ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా..!

దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన అదొక చారిత్రక సుందర ప్రదేశం. చిట్టడవిలో ఎత్తైన గుట్టలు.. అలాంటి సుందర ప్రదేశంలో చప్పట్లు కొడితే చాలు.. చల్లని నీళ్లు కొండ‌ల పైనుంచి వ‌స్తాయి. వినడానికి ఆశ్చ‌ర్యం కలిగించిన ఇది నిజం. మ‌రి ఈ ప్ర‌దేశం ఎక్కడుందో తెలుసుకుందాం.water fall story

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అటవీప్రాంతంలోని పెద్దయ్యదేవుని గుట్ట, లక్సెట్టిపేట మండలంలో చిన్నయ్య గుట్టలు ఉన్నాయి. ఈ చిన్నయ్య, పెద్దయ్య గుట్టలు గిరిజనులకు ఆరాధ్యదైవాలుగా నిలుస్తున్నాయి. ఇక్కడి ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆధ్మాత్మికంగా భక్తుల కోర్కెలు తీరుస్తున్నాయి. పెద్దయ్యదేవుని గుట్ట దండేపల్లి మండల కేంద్రం నుంచి దాదాపు పదికిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఉంటుంది. గుట్ట చూడటానికి స్తంభంలా సుమారు 1000 అడుగుల ఎత్తు ఉంటుంది. అంతే ఎత్తయిన కొండల వరుసలు వలయాకారంగా ఉండటంతో అవన్ని దాటుకుని వెళ్లే వరకు పెద్దయ్య గుట్ట మనకు కనిపించదు.peddaiah gutta no. 1

ఇక పురాణాలకు వస్తే కుంతీదేవి సంతానం కోసం శంకరుడి వద్ద మొరపెట్టుకుందని చెబుతున్నాయి. తనకు సంతానం ప్రసాదించమని ఆయనను వేడుకోవడంతో ఆయన ఆమెను పరీక్షించాలనుకుని కప్పలు, చేపలు ముట్టని నీళ్లు, కుమ్మరి చేయని కుండలో, దూసవారి వడ్లతో అంటే విత్తనాలు చల్లకున్నా అవే రాలి అవే మొలిచే సువాసన గల ఉత్తమ వడ్లతో నాకు నైవేద్యం పెట్టాలని కోరాడు. దీంతో కుంతీదేవి తన ఛాతిపై మట్టి కుండను చేసి చేపలు, కప్పలు ముట్టని నీళ్ల కోసం తిరిగి అవి ఎక్కడా కనపడకపోవడంతో అలిసిపోయి సొమ్మసిల్లిపోయింది. ఆమె సత్యనిష్ఠకు మెచ్చిన శంకరుడు ఆ కొండలపై నుంచి నీళ్లను కురిపించాడు. అప్పుడు ఆ తల్లి ఆ నీటితో, కుమ్మరి చేయని కుండలో నైవేద్యం వండి శంకరుడికి పెడుతుంది. అప్పుడు శంకరుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. వారే పాండవులు. అందులో పెద్దవాడైన ధర్మరాజు పెద్దయ్యగా, భీముడు చిన్నయ్యగా ఇక్కడ వెలిశారని స్థానికులు చెబుతుంటారు. ఆనాటి నుంచి చిన్నయ్య దేవుని సమీపంలో ఉన్న కొండలను మంచుకొండలని పిలుస్తున్నారు.gutta pedaiah 2

చిన్నయ్య దేవుని దగ్గర్నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మంచుకొండలు ఉంటాయి. ఆ కొండల వద్దకు వెళ్లిన భక్తులు చప్పట్లు కొడుతూ అలజడి చేస్తే పై నుంచి నీళ్లు పడతాయి. ఇవి చల్లగా ఎంతో తియ్యగా ఉంటాయి. ఎంత ఎక్కువ మంది చప్పట్లు కొడితే అంత ఎక్కువ ధారతో నీళ్లు వస్తుంటాయి. ఈ నీటిని తీసుకెళ్లి అందులో పసుపు, కుంకుమలతో కలిపి చల్లితే పంటలకు చీడపీడ ఉండదని స్థానిక రైతుల నమ్మకం.

Related posts