telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

ఈ నెల 13న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్ధిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచి ప్రజలు చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పేర్కొన్నారు.

పిఠాపురంలో మార్పుకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతీ ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీరమహిళలకు, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా చెప్పారు.

”పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే స్వచ్చందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిగా భావించి పని చేయడం ఎంతో ఆనందం కలిగించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల సమయం వరకూ పోలింగ్లో పాల్గొని రికార్డ్ స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు అవ్వడం అనేది మీ ప్రేమను తెలియజేస్తుంది.

అదే సమయంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువలేనిది.

అలాగే రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ అనుభవం వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. అలాగే నిన్న పుట్టినరోజు వేడుకలు చేసుకున్న వర్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

తనకు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేసిన సినీ, బుల్లితెర నటీ, నటులకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

అలాగే దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్నారై జనసైనికులకు నా అభినందనలు” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Related posts