telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

ఏపీలో … తీవ్రంగా వడగాలులు వీచే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

heat waves in AP for next two days

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ ఎండల తీవ్రత పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో మంగళవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు కావడం జనాల్ని బెంబేలెత్తిస్తోంది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 45.69, దర్శిలో 45.65, లింగసముద్రంలో 45.21, కంభంలో 45.48, కడపలో 45.4, చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడులో 45.05, మహానందిలో 45.51, వెంకటగిరిలో 45.16 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 11 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. 157 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీలు నమోదైనట్టు తెలిపింది.

వాతావరణ శాఖ రాష్ట్రంలో మరోసారి వడగాల్పులు పెరగనున్నాయి అంటూ హెచ్చరించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు తీవ్రస్థాయిలో వడగాల్పులు ఉండొచ్చని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఎక్కువగా వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వడగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల మోస్తరు స్థాయిలో వీచే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రంలో పలుచోట్ల 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు రాయలసీమకు వర్షసూచన ఉన్నట్టు తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల ముందస్తు రుతుపవన వర్షాలు కురిసే సూచన ఉన్నట్టు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది.అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

Related posts