telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అలా చేస్తే.. టెస్ట్ మ్యాచ్ స్ఫూర్తి పోయినట్టే.. : సచిన్

sachin-tendulkar cricketer

ఐసీసీ తాజాగా నాలుగు రోజుల టెస్టు సూచన పై సచిన్‌ తెందుల్కర్ వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తాను వ్యతిరేకించడానికి గల కారణాలను సచిన్‌ తెలిపాడు. నాలుగు రోజుల టెస్టుతో బ్యాట్స్‌మన్ ఆలోచన తీరు పూర్తిగా మారిపోతుందని, అది సంప్రదాయ ఫార్మాట్‌ సారాంశాన్ని పోగొడుతుందని అభిప్రాయపడ్డాడు.’క్రికెట్‌కు స్వచ్ఛమైన రూపం టెస్టులే. ఎన్నో ఏళ్లు నుంచి ఆడుతున్న సంప్రదాయ క్రికెట్‌ ఫార్మాట్‌ను నాలుగు రోజులకు కుదించకూడదని నా అభిప్రాయం. టెస్టుల నిడివిని తగ్గిస్తే బ్యాట్స్‌మెన్‌ ఆలోచనతీరు మారిపోతుంది. టెస్టును పరిమత ఓవర్ల సుదీర్ఘ ఫార్మాట్‌ మ్యాచ్‌గా వారు భావిస్తారు. ఎందుకంటే మీరు రెండో రోజు లంచ్‌ సమయం వరకు బ్యాటింగ్ చేశారనుకోండి. ఆ తర్వాత ఇక రెండున్నర రోజుల ఆటే మిగిలిందని మీ మదిలో ఆలోచనలు మొదలవుతాయి. అప్పుడు టెస్టు సారాంశమే పూర్తిగా మారిపోతుందని అన్నాడు.

అయిదో రోజు ఆటను తీసివేయడం వల్ల ఆఖరిరోజు పిచ్‌పై ఏర్పడిన పగుళ్లను ఉపయోగించుకొని వికెట్లు తీసే అవకాశాన్ని స్పిన్నర్లు కోల్పోతారు. ఆ అవకాశాన్ని స్పిన్నర్ల నుంచి తీసివేయడం అంటే తొలిరోజు ఫాస్ట్ బౌలర్లును బౌలింగ్ చేయకూడదనే చెప్పడం. ఆఖరి రోజు చివరి సెషన్‌లో స్పిన్నర్లు బౌలింగ్‌ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆ సమయంలో బంతి టర్న్‌ అవ్వడం, బౌన్స్ లభించడాన్ని బౌలర్లు చక్కగా ఉపయోగించుకుంటారు. అదే తొలి రెండు రోజులు బంతి అంతగా టర్న్‌ అవ్వదని సచిన్‌ పేర్కొన్నాడు. 2023-31 మధ్య కొత్త భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో అయిదు రోజులకు బదులు నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలనే ఐసీసీ ప్రతిపాదనను క్రికెటర్లు, మాజీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌, స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌.. మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్‌, మెక్‌గ్రాత్‌, గంభీర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

Related posts