telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఆర్టీసీ యూనియన్ ల మధ్య రగడ.. ఫిట్ మెంట్ ప్రధాన ఎజండా..

issues raised in rtc unions on fitment

ఆర్టీసీ కార్మికులు తమకు 50 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటిసు ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 6వ తేదీ ఆర్టీసీలో సమ్మె ఆరంభం కావాల్సి ఉంది. ఈలోగా రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక సంఘాలు, ఆర్టీసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని 50 శాతం ఫిట్ మెంట్ ఇవ్వలేమని, 25 శాతానికి అంగీకరించాలని ప్రతిపాదించారు. దీనిపై చర్చల్లో పాల్గొన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సంతృప్తిపడి సమ్మెను విరమించారు.

ఫిట్ మెంట్ 50 శాతం సాధిస్తామని హామీ ఇచ్చి, చివరికి 25 శాతానికి ఒప్పుకోవడాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమకు 50 శాతం చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకుని రావాలని డిమాండ్ చేస్తోంది. 25 శాతం ఫిట్ మెంట్ కు నిరసనగా ఆ యూనియన్ లో సభ్యులుగా ఉన్న కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్దా ధర్నాలు చేస్తున్నారు. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గేట్ల వద్ద బైఠాయించారు. నల్ల బ్యాడ్జీలను ధరించి, విధులకు హాజరయ్యారు. ఫిట్ మెంట్ కోసం తాము దాదాపు రెండేళ్లుగా వేచి చూస్తున్నామని వారు చెబుతున్నారు. ఈ ఫిట్ మెంట్ తమను నిరుత్సాహ పరిచిందని వాపోతున్నారు. దీన్ని బ్లాక్‌ డే అభివర్ణిస్తున్నారు. తమ తరఫున చర్చల్లో పాల్గొన్న జేఏసీ నాయకులపై మండిపడుతున్నారు.

జేఏసీ నాయకులూ దీనిపై వారి వాదనను వినిపిస్తున్నారు. 25 శాతం ఫిట్ మెంట్ అనేది తుది నిర్ణయం కాదని, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ తర్వాత వారితో సమానంగా ఇతర బెనిఫిట్లను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని జేఏసీ కన్వీనర్‌ పలిశెట్టి దామోదర్‌రావు చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తాం, 50శాతం వేతన సవరణ సాధిస్తాం అని కార్మికులను మభ్యపెట్టి ఓట్లేయించుకున్న ఎంప్లాయీస్‌ యూనియన్‌ 52 వేల మందికి ద్రోహం చేసిందని ఎన్‌ఎంయూ నేతలు మండిపడ్డారు. విజయవాడ, తిరుపతిలో నిరసనలో పాల్గొని జేఏసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేతలు ఎంతకు అమ్ముడు పోయారని విమర్శించారు.

Related posts