telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేట్‌ టీచర్లకు నెలకు రూ.2వేలు : ఇలా అప్లయ్ చేసుకోండి

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి . విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల నుంచే అర్హుల ఖాతాల్లోకి రూ. 2 వేలు తెలంగాణ ప్రభుత్వం వేయనుంది. అయితే.. దీనికి ఎలా అప్లయ్‌ చేయాలో తెలుసుకుందాం. ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం… గుర్తింపు పొందిన ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాల నుంచి టీచర్ల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయాలని సూచించింది ప్రభుత్వం. టీచర్ల బ్యాంకు ఖాతా నంబర్‌, ఆధార్‌ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పింది. ఆ వివరాలను ఎంఈవోలు, డీఈవోలు, అధికారులతో తనిఖీ చేయించి.. కలెక్టర్ల ద్వారా విద్యాశాఖకు పంపుతారు. వీటి ఆధారంగా ప్రభుత్వం సాయం చేస్తుంది. ఏప్రిల్‌ 10 నుంచి 15 వ తేదీ వరకు స్కూల్స్‌ వివరాల సేకరణ జరుగనుండగా.. ఇదే నెల 20 నుంచి 24 తేదీల్లో అర్హులైన ఉపాధ్యాయుల ఖాతాల్లో రూ. 2 వేలు చొప్పున నగదు జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు.. 21 నుంచి 25 వ తేదీ వరకూ ఉచితంగా 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం.

Related posts