నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడో భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
భారత్ ఒక ‘గొప్ప ప్రజాస్వామ్యం’ అని, ప్రపంచంలోని అనేక దేశాలకు ‘ఒక ఉదాహరణ’ అని ఆమె కొనియాడారు.
వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడిన తర్వాత భారత్‌తో అన్ని రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ తమకు గొప్ప మిత్రదేశం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని ఆశిస్తున్నానని, స్వేచ్ఛాయుత వెనిజులాలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు.
గత 15 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె ‘టైమ్స్ నౌ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ ఎన్నో దేశాలకు, తరాలకు ఆదర్శంగా నిలిచింది.
ఇది చాలా గొప్ప విషయం. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు, దానిని నిరంతరం బలోపేతం చేసుకోవాలి.
ప్రపంచంలోని ఎన్నో దేశాలు మీ వైపు చూస్తున్నాయి’’ అని ఆమె అన్నారు. తాను భారత్‌ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తానని, తన కుమార్తె కొన్ని నెలల క్రితమే భారత్‌ను సందర్శించిందని, అక్కడి సంస్కృతిని ఎంతో ఇష్టపడిందని ఆమె చెప్పారు.
మహాత్ముడి అహింసాయుత పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందని, శాంతియుతంగా ఉండటం బలహీనత కాదని గాంధీ ప్రపంచానికి చాటిచెప్పారని ఆమె పేర్కొన్నారు.

