జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మంది టూరిస్టులను ఆమానుషంగా కాల్చిచంపిన ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి.
‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని మౌంట్ మహదేవ్ సమీపంలో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి.
ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులూ హతమైనట్టు అధికార వర్గాలు మంగళవారంనాడు తెలిపాయి. వీరిలో ఒకరిని లష్కరే టాప్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ (Musa Fauji)గా గుర్తించారు.
పహల్గాం ఉగ్రకుట్ర వెనుక ముసా ప్రధాన సూత్రధారి అని అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది శ్రీనగర్-సోన్‌మార్గ్ హైవేపై జడ్ మోడ్ టన్నెల్ నిర్మాణంలో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడుగురుని పొట్టనబెట్టుకున్న ఘటనలో ముసా ప్రమేయం ఉంది.
కాగా, ఎన్‌కౌంటర్ స్థలం నుంచి 17 గ్రనేడ్లు, ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే-47 రైఫిల్స్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
దాచీగమ్ అడవుల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టు స్థానికులు కొందరు ఈనెల మొదట్లో ఆర్మీకి సమాచారం అందించారు.
దీంతో 14 రోజులుగా లష్కరే, జైష్ ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచారు. వారి కదలికలను కనిపెట్టేందుకు రెండ్రోజుల క్రితం శాటిలైట్ కమ్యూనికేషన్ తిరిగి యాక్టివేట్ చేశారు. అనంతరం పలు ఆర్మీ టీమ్‌లను దాచీగమ్ అడవులకు తరలించారు.
సోమవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ముగ్గురు టెర్రరిస్టుల కదలిలకలను గుర్తించారు. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ ముగ్గురినీ మట్టుబెట్టారు.
గత నెలలో ఎన్ఐఏ పర్వయిజ్ జోథర్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు స్థానికులను అరెస్టు చేసింది. పహల్గాం ఉగ్రవాదులకు వీరు ఆశ్రయమిచ్చినట్టు గుర్తించారు.


సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు ఎదురుదాడి: చంద్రబాబు