telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

ఐపీఎల్ 2020 లో స్కోరర్ గా వ్యవహరించింది తెలుగువాడే…

ఐపీఎల్-2020 సీజన్ ‌పై తెలంగాణ బ్రాండ్ పడింది. తెలంగాణ ముద్ర కనిపించింది. తెలంగాణకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈ టోర్నమెంట్ స్కోరర్‌గా పనిచేశారు. ఆయన స్వస్థలం జనగామ. ఉద్యోగరీత్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పనిచేస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన అన్ని మ్యాచ్‌లకూ ఆయనే ప్రధాన స్కోరర్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోయేది ఈ స్టేడియంలోనే. 39 సంవత్సరాల ప్రశాంత్ కుమార్.. దివ్యాంగుడు. ఐపీఎల్ టోర్నీలో మ్యానువల్‌గా స్కోరుబోర్డును నోట్ చేసేది ఆయనే. స్కూల్ స్థాయిలో క్రికెట్‌ను ఆడేవాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్. శ్రీ అరబిందో హైస్కూల్‌ తరఫున క్రికెట్ ఆడారు. విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ను పూర్తి చేశారు.

అనంతరం ఆయనకు దుబాయ్‌లోని యోగి గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉద్యోగం లభించింది. అదే సంస్థలో పనిచేసే శివ పగరాణితో పరిచయం ఏర్పడిన తరువాత.. క్రికెట్ వైపు అడుగులు వేశారు. ఉద్యోగం చేస్తూనే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో స్కోరర్‌గా చేరారు. శివ..దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ సభ్యుడు కావడంతో ప్రశాంత్ కుమార్‌ను ప్రోత్సహించారు. 2009లో దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో ఆయన స్కోరర్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఆ స్టేడియంలో జరిగే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లన్నింటికీ ఆయనే స్కోరర్. క్రికెట్‌పై తనకు ఉన్న ఆసక్తి తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ప్రశాంత్ కుమార్ చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఓ ఇంగ్లీష్ డెయిలీకి ఆయన టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. క్రికెట్ పట్ల తనకు ఉన్న ఆసక్తిని గమనించిన సంస్థ యాజమాన్యం కూడా ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. యోగి గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌లో అసిస్టెంట్ డివిజినల్ మేనేజర్‌గా నియమించిందని పేర్కొన్నారు.

Related posts