ప్రతిపక్ష హోదా దక్కలేదనే కారణంతో వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.
నిబంధనల ప్రకారం అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా, ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఒక చంటి పిల్లాడిలా మారాం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
“అసెంబ్లీ నిబంధనల ప్రకారం 10 శాతం, అంటే కనీసం 18 స్థానాలు గెలిచిన పార్టీకే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఈ సాధారణ విషయం తెలిసినప్పటికీ జగన్ అనవసరంగా పట్టుబడుతున్నారు” అని వ్యాఖ్యానించారు.
చట్టసభలకు వరుసగా 60 రోజుల పాటు సభ్యులు గైర్హాజరైతే, వారి సభ్యత్వం వాటంతట అదే రద్దవుతుందనే నిబంధనను ఆయన గుర్తుచేశారు.
తాను డిప్యూటీ స్పీకర్‌గా, వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
“వారు సభకు రాకుండా, ఉప ఎన్నికలనే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదే వారి ఉద్దేశమైతే మేం చేయగలిగిందేమీ లేదు. పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం” అని రఘురామకృష్ణరాజు అన్నారు.
వారి నిర్ణయం వల్ల పులివెందుల వంటి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా సూచించారు.
మోదీ భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు: రాహుల్