telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత ఆటగాళ్లకు ఊరట కల్పించిన ఈసీబీ…

భారత పురుషులు, మహిళల జట్లు.. ఓరాస్తుతం వారి కుటుంబాలతో సహా ముంబైలో క్వారంటైన్లో ఉన్నాయి. ఇంగ్లండ్ పర్యటన కోసం జూన్‌ 2న రెండు జట్లు ఒకే ఛార్టర్‌ విమానంలో బ్రిటన్‌కు వెళ్తాయి. కోహ్లీసేన నేరుగా సౌతాంప్టన్‌లో దిగి అక్కడి హోటళ్లలో క్వారంటైన్ అవుతుంది. మిథాలీ సేన బ్రిస్టల్‌కు వెళ్లి స్థానికంగా క్వారంటైన్ కానుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ రెండు టెస్టుల సిరీసూ ఇదే సమయంలో జరుగుతుంది. దాంతో కివీస్‌ ఆటగాళ్లు, భారత క్రికెటర్లు ఒకే హోటళ్లలో ఉంటారని సమాచారం. ఇక ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న భారత జట్లకు శుభవార్త అందింది. కఠిన క్వారంటైన్‌ ఆంక్షలను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోదు సడలించింది. బీసీసీఐ చర్చలతో 10 రోజుల కఠిన క్వారంటైన్‌ను 3 రోజులకు తగ్గించింది. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే ఇంగ్లండ్ గడ్డపై సాధన చేసుకోవచ్చు. సుదీర్ఘ పర్యటన కావడంతో క్రికెటర్ల కుటుంబ సభ్యులూ ఇంగ్లండ్ వెళ్తున్న సంగతి తెలిసిందే. వారికి మాత్రం పది రోజుల కఠిన క్వారంటైన్‌ ఉండనుంది. అయితే వీరి విషయంలో కూడా బోర్డు చర్చలు జరుపుతోంది. మిథాలీ సేన జూన్‌ 16న ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో తలపడుతుంది. ఆ తర్వాత 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. మరోవైపు జూన్‌ 18-22 వరకు కోహ్లీసేన, విలియమ్సన్‌ బృందంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ఢీ కొననుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు సిరీసు ఆడుతుంది.

Related posts