telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఐఏఎఫ్ ఏఎన్-32 విమాన గాలింపు.. విషాదంగా.. 13 మృతి ..

iaf an-32 flight crashed 13 died

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయిన ఎన్-32 విమానం కోసం చేపట్టిన గాలింపు విషాదంగా ముగిసింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఐఏఎఫ్ ప్రకటించింది. కొండప్రాంతంలోని దట్టమైన అడవిలో విమాన శకలాలు కనుగొన్న తర్వాత సహాయక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఏఎన్ 32 విమానం కూలిపోయిన ఘటనలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదని ఐఏఎఫ్ వెల్లడించింది. జూన్ 3న జరిగిన ఎన్-32 విమాన ప్రమాదంలో చనిపోయిన యుద్ధ వీరులకు ఐఏఎఫ్ నివాళులర్పిస్తోంది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. అని ఐఏఎఫ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

మృతుల్లో వింగ్ కమాండర్ జీఎం చార్లెస్, స్కాడ్రన్ లీడర్ హెచ్ వినో్ద్, ఫ్లైట్ లెఫ్టినెంట్లు ఎల్ఆర్ తాపా, ఎంకే గార్గ్, ఆశిష్ తన్వార్, సుమిత్ మహంతీ, వారెంట్ ఆఫీసర్ కేకే మిశ్రా, సార్జెంట్ అనూప్ కుమార్, కార్పోరల్ షేరిన్, లీడింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యాన్(ఎల్ఏసీ) ఎస్‌కే సింగ్, ఎల్ఏసీ పంకజ్, నాన్ కంబాటెంట్స్ రాజేష్ కుమార్, పుతలి ఉన్నారు. రష్యా తయారీ విమానమైన ఏఎన్-32.. ఈనెల 3న అస్సాంలోని జోర్హాట్ నుంచి చైనా సరిహద్దుల్లోని మెంచుకకు బయల్దేరి వెళ్లింది. అయితే విమానం బయల్దేరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఎనిమిది రోజుల గాలింపు అనంతరం సియాంగ్ షియోమీ జిల్లాల సరిహద్దుల్లోని గట్టే గ్రామం వద్ద విమాన శకలాలు లభ్యమయ్యాయి. 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమాన శకలాలను మంగళవారం ఐఏఎఫ్‌కి చెందిన ఓ హెలీకాప్టర్ గుర్తించింది.

Related posts