ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల అంశం చర్చించనున్నారు. పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇప్పటికే పరిషత్ ఎన్నికలపై కోర్టులో ఓ కేసు పెండింగ్ లో ఉన్న అంశాన్ని కూడా ఆమె ఉన్నతాధికారులతో చర్చించారు నీలం సాహ్ని.
అయితే… ఎన్నికల కమిషన్‌తో ఇవాళ జరగనున్న సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందన్నారు. ఇందుకు నిరనసనగా ఇవాళ ఎస్ఈసీ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యన్నారు. ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందన్నారు పవన్.