పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హిందూపురం ప్రజల ఆదరణకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
హిందూపురంలో జరిగిన సన్మాన సభను జీవితంలో మరువలేని అనుభూతిగా అభివర్ణించారు. ప్రజల అభిమానం తండ్రికి పిల్లలు చూపిన ఆత్మీయతలా అనిపించిందని వ్యాఖ్యానించారు.
హిందూపురం కేవలం నియోజకవర్గం కాదని, తన హృదయ స్పందన అని ఉద్ఘాటించారు. ప్రజల ప్రేమకు జీవితాంతం నిస్వార్థ సేవతో బదులిస్తానని భావోద్వేగ హామీ ఇచ్చారు.
“పద్మభూషణ్ అనే గౌరవప్రదమైన పురస్కారం లభించిన ఈ ఆనందకరమైన క్షణాల్లో, నా ప్రియమైన హిందూపురం ప్రజలు చూపిన ఆత్మీయత, ప్రేమ, ఆదరణ నాకు చిరకాలంగా గుర్తుండిపోయే అనుభూతిని ప్రసాదించాయి.
మీరు ఏర్పాటు చేసిన సన్మాన సభ హృదయాన్ని తాకే మధుర ఘడియలు నా జీవితంలో మరువలేని అనుభవంగా నిలిచిపోయింది.
అది ఒక నాయకునికి ప్రజలిచ్చే గౌరవం కంటే ఒక తండ్రికి తన పిల్లలు చూపే ఆత్మీయతలా అనిపించింది. మీరు చూపిన ఆ ప్రేమ ఒక శక్తిగా, ఆశీర్వాదంగా మారి, నా జీవితం మొత్తానికీ వెలుగులా నిలుస్తుంది. హిందూపురం నాకు ఓ నియోజకవర్గం కాదు అది నా హృదయపు స్పందన.
నా హృదయంలో చిరకాలంగా తీయగా మోగే జననీ స్వరం ప్రతి చిరునవ్వులో నన్ను నిలబెట్టిన నిస్వార్థ ప్రేమ స్థలం.
మీరు ఇచ్చిన ప్రేమకు బదులివ్వలేను కానీ జీవితాంతం మీ సేవలో నిస్వార్థంగా ఉండే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. మీరు చూపిన నిస్వార్థ ప్రేమకు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను.
ఈ గౌరవాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు.
మీ ప్రేమను ఈ జీవితంలో మరచిపోలేను” అని బాలయ్య సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.