telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈరోజు ధర్మవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన

ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఈరోజు హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ధర్మవరంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజులు చేశారు.

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా అడుగడుగునా హోంమంత్రికి మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. తరువాత గ్రామస్తులతో ముఖాముఖీలో పాల్గొన్నారు.

ధర్మవరం గ్రామానికి చెందిన యువకుడు పల్లా అప్పలరాజుకు ఇటీవలే రోడ్డుప్రమాదం జరిగింది.

దీంతో పల్లా అప్పలరాజును హోంమంత్రి పరామర్శించారు. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికలు లేవని ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ధర్మవరం వచ్చినట్లు చెప్పారు.

ధర్మవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో సర్పంచ్‌‌లకు అధికారాలు లేవని అన్నారు. గత ఐదు సంవత్సరాలు ధర్మవరంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని ఒక్క డ్రైన్ పూర్తి చేయలేదని విమర్శించారు.

నాడు – నేడు పేరుతో డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నో పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. గతంలో సరైన విత్తనాలు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యలు చేశారు.

గతంలో సర్పంచ్‌లకు కనీసం బ్లీచింగ్ పౌడర్ జల్లడానికి కూడా డబ్బులు లేవని తెలిపారు. ఎన్డీయే పాలన పారదర్శక పాలన అని చెప్పుకొచ్చారు.

ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం ప్రారంభమతుందని వెల్లడించారు.

గత ఐదు సంవత్సరాలు గంజాయి విచ్చలవిడిగా ఉండేదని గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు.

గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు రానున్నాయని ప్రకటించారు.

నియోజకవర్గంలో స్టీల్ ఫ్లాంట్, టాయ్ పరిశ్రమలు రానున్నాయని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

జిల్లా పర్యటనలో భాగంగా ధర్మవరం గ్రామానికి చెందిన టీడీపీ సినీయర్ నాయకులు కలిగట్ల సూర్యనారాయణను హోంమంత్రి అనిత పరామర్శించారు.

ఇటీవలే సూర్యనారాయణ గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనను పరామర్శించిన హోంమంత్రి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.

Related posts