వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శనలు చేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పర్యటనలకు తాము అభ్యంతరం చెప్పబోమని, అయితే వైసీపీ సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు.
తగిన సమాచారం అందిస్తే, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.
మహిళల గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించడం ఏంటని అనిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సాక్షి ఛానెల్‌లో ఫేక్ వీడియోలు ప్రసారం అవుతున్నాయని, బంగారుపాళ్యం పర్యటన వీడియోలను నెల్లూరు పర్యటన వీడియోలుగా చూపిస్తున్నారని అనిత ఎద్దేవా చేశారు.
పాత పర్యటనల వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సాక్షిలో చిత్రీకరిస్తున్నారని ఆమె అన్నారు.
ఇవాళ జగన్ పర్యటనలో తమ కానిస్టేబుల్‌కు చేయి విరిగిందని అనిత వెల్లడించారు. జగన్ ఏ పర్యటనకు వెళ్లినా ఏదో ఒక అవాంఛనీయ ఘటన జరుగుతుందని ఆమె విమర్శించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.
ప్రజాసేవలో ఉన్న మహిళలపై వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. తన తల్లి, చెల్లి గురించి గతంలో నీచాతినీచంగా మాట్లాడినప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు.
తల్లి, చెల్లిపై కోర్టులో విజయం సాధించినందుకు జగన్ సంబరపడుతున్నారని విమర్శించారు. గతంలో వైసీపీ సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తులు జగన్ తల్లి, చెల్లిపై అసభ్యకర పోస్టులు పెట్టినా, జగన్ మౌనంగా ఉన్నారని గుర్తుచేశారు.
ఇప్పుడు మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని పరామర్శించేందుకు నెల్లూరు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.