హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా జరిగింది.
దేవాదాయాలు, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖకు చెందిన మాజీ ఓఎస్డీ సుమంత్‌పై అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు రావడంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో ఆమె ఇంటికి వచ్చారు.
సుమంత్ అక్కడ దాక్కున్నాడనే సమాచారం ఆధారంగా అతన్ని అరెస్టు చేయడానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనలో మంత్రి కూతురు కొండా సుస్మిత పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆరోపణలు చేసింది.
బీసీ వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారనీ బీసీల అణచివేత జరుగుతోందనేలా ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది.
సుమంత్ సంగతి చూస్తే, అతను 2024 ఫిబ్రవరి నుంచి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి లో ఓఎస్డీగా పనిచేస్తూ, మంత్రి సురేఖ పేషీకి డిప్యుటేషన్‌పై వెళ్లాడు.
సుమంత్ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నాడనీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడనీ కాలుష్యకారక పరిశ్రమల విషయాల్లో తల దూర్చు, అధికార పరిధిని దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి.
ఇటీవల డెక్కన్ సిమెంట్ కంపెనీ అధికారులను గన్‌తో బెదిరించిన ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశాలు జారీచేశారు.
మంగళవారం పీసీబీ కార్యదర్శి రవి సుమంత్‌ను విధుల నుంచి తొలగించే ఆదేశాలు ఇచ్చారు. తొలగింపు తర్వాత వరంగల్ పోలీసులు అతన్ని వెతకడం మొదలుపెట్టారు.

