ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు.
మద్యం అమ్మకాల్లో పారదర్శకతను తగ్గించేందుకు ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్ గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని, దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.
ఈ స్కామ్ లో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని లూథ్రా కోర్టుకు తెలిపారు. ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని చెప్పారు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు.
మిథున్ రెడ్డి తరపున టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు.
షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇటీవలే ఈ వాదనలను విన్న హైకోర్టు ఈరోజుకు తీర్పును రిజర్వ్ చేసింది.
తాజాగా మిథున్ రెడ్డి ముందుస్తు బెయిల్ ను కొట్టివేస్తూ ఈరోజు తీర్పును వెలువరించింది.