telugu navyamedia
క్రీడలు వార్తలు

పుజారాలా దెబ్బలు తాకించుకునే ఆటగాడిని ఎప్పుడు చూడలేదు

చతేశ్వర్‌ పుజారాపై ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. గబ్బా టెస్టులో అతను మొక్కవోని ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడని, ఒక ఎండ్‌లో పుజారా, మరో ఎండ్‌లో పంత్‌ను చూడటం విచిత్రంగా అనిపించిందని వెల్లడించాడు. తాజాగా మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘పుజారాతో నేనొక్కసారీ కూడా మాట్లాడలేదు. కానీ నాకు అతని గురించి ఎంతో తెలుసనిపిస్తుంది. అతనో పటిష్ఠమైన రాతిగోడ. రెండేళ్ల క్రితం ఆడినట్టు అతను ప్రభావం చూపకపోవడంతో చివరి సిరీస్‌లో మేం సులువుగా విజయం సాధిస్తామనిపించింది. కానీ సిడ్నీ, గబ్బా టెస్ట్‌ల్లో అతను అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. తిరుగులేని డిఫెన్స్‌ ఆడగలిగే బ్యాట్స్‌మన్ కూడా కొన్ని షాట్లు ఆడితే అతని వైఖరిలో మార్పు వస్తుంది. అప్పుడు తనకు అవకాశం దొరుకుతుందని బౌలర్‌ భావిస్తాడు. కానీ నాలుగో టెస్ట్‌లో పుజారా తన దేహానికి బంతులు తగిలించుకున్నాడు. పంటి బిగువన నొప్పిని భరించాడు. నిజంగా అది సాహసోపేత ఇన్నింగ్సే. అలా దెబ్బలు తగిలించుకున్న వారిని నేనెప్పుడూ చూడలేదు. అతనో క్లాస్‌ ఆటగాడు. ఇక రిషభ్ పంత్‌తో కలిసి పుజారా ఆడాడు. వీరిద్దరివీ భిన్న వ్యక్తిత్వాలు. కానీ అభిమానులు వారిద్దరినీ ప్రశంసించాల్సిందే. టెస్టు క్రికెట్‌ను ఇష్టపడేందుకు ఇవన్నీ ప్రేరణనిస్తాయి’ అని కమిన్స్‌ వెల్లడించాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వరుసగా రెండు సిరీసులు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Related posts