telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు: భారత వాతావరణ శాఖ

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది.

రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

వాతావరణ శాఖ సూచన ప్రకారం, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ, ఆ రోజుకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది.

మొంథా తీరాన్ని తాకడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కచ్చితమైన అంచనాలకు పేరుగాంచిన ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ తెలిపారు.

ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ.

యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు.

కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

హైదరాబాద్ విషయానికొస్తే, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడపాదడపా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఐఎండీ సైతం నగరంలో మోస్తరు వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం పూట పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Related posts