ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ (IPS) అధికారి అయిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తా కు పోలీసు దళాల అధిపతిగా (హెచ్వోపీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. హరీష్ కుమార్ గుప్తా ఇప్పటికే ఒకసారి డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం గతేడాది మే 6న ఆయన్ను డీజీపీగా నియమించింది. జూన్ 19 వరకు ఆ పోస్టులో కొనసాగారు.
సమర్థుడైన అధికారిగా ఆయనకు పేరుంది. శాంతిభద్రతల విభాగం ఐజీ (IG), అదనపు డీజీపీ పోస్టులో ఎక్కువ కాలం కొనసాగారు. శుక్రవారం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

