తెలంగాణ అసెంబ్లీకి సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైనారు. అసెంబ్లీకి కేసీఆర్ రావడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే, కొన్ని నిమిషాలు మాత్రమే కేసీఆర్ సభలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రంగా విమర్శలు చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ సభకు రాలేదని కేవలం తన ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేగా జీతం పొందడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారని ఐలయ్య ఎద్దేవా చేశారు.
“బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఆయన అసెంబ్లీకి వచ్చే క్రమాన్ని హైప్ చేశారు. కానీ నిజానికి ఆయన రెండు నిమిషాలు కూడా సభలో ఉండకుండానే వెళ్లిపోయారు” అని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.
అలాగే, సభలో దళిత స్పీకర్‌ను “అధ్యక్షా” అని పిలవాల్సి వస్తుందని, దళితుల సమస్యలపై చర్చించాల్సి వస్తుందనే కేసీఆర్ వెళ్లిపోయారని విమర్శించారు.
దళితుల పట్ల ఆయనకు నిజమైన గౌరవం లేదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.

