ప్రపంచ కప్ లో పరుగుల వరదతో పాటుగా రికార్డుల మోత కూడా మోగుతుంది. తాజా మ్యాచ్ లో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్‌గేల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. మ్యాచ్ ముందు వరకు ఇంగ్లాండ్‌పై 1596 పరుగులు చేసిన గేల్ నిన్న(36; 41 బంతుల్లో 5×4, 1×6) పరుగులు చేశాడు. దీంతో ప్రపంచకప్ ఆతిథ్య జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా తొలి స్థానంలో నిలిచాడు. మొత్తం 36 మ్యాచ్‌ల్లో 34 ఇన్నింగ్స్ ఆడిన స్టార్ బ్యాట్స్‌మన్ 1632 పరుగులు పూర్తిచేశాడు.
గేల్ తర్వాత కుమార సంగక్కర 44 మ్యాచ్‌ల్లో 1625, వీవ్‌రిచర్డ్స్ 36 మ్యాచ్‌ల్లో 1619 చేశారు. తర్వాత రికీపాంటింగ్ 39 మ్యాచ్‌ల్లో 1598, మహేళా జయవర్దనే 47 మ్యాచ్‌ల్లో 1562 నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. దీంతో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ తరఫున దిగ్గజ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును సుడిగేల్ అధిగమించాడు. వెస్టిండీస్ ఓపెనర్ తాను ఎదుర్కొన్న తొలి 15 బంతుల వరకు ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయాడు. నాలుగో ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో తొలి బౌండరీ బాది పరుగుల ఖాతాను తెరిచాడు. అనంతరం అతడి బౌలింగ్‌లోనే రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్క్‌వుడ్ క్యాచ్ వదిలేయడంతో గేల్ తప్పించుకుని, అనంతరం బౌండరీలతో చెలరేగాడు.