telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ముఖ్యమైన సూచనలు ఇచ్చిన మోర్గాన్…

నిన్న భారత్‌తో జరిగిన ఆఖరి టీ20లో 36 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. 2-3తో సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్.. ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులను అలవర్చుకోవాలన్నాడు. ‘రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆటగాళ్లకు ఉపకరిస్తుంది. ఈ టీ20 లీగ్‌లో ఏ అవకాశం వచ్చినా ఆటగాళ్లు రెండు చేతులతో ఒడిసిపట్టుకోవాలి. వాటిని పూర్తిగా అందిపుచ్చుకోవాలి. ఐపీఎల్‌ తర్వాత జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు మేం స్వదేశంలో న్యూజిలాండ్‌, భారత్‌తో రెండు టెస్టు సిరీస్‌లు ఆడనున్నాం. ఆపై బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడనున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ కోసం అత్యుత్తమ పదకొండు మందిని ఎంపిక చేయడానికి ఆయా పర్యటనలు సరిపోవు. కాబట్టి.. రాబోయే రెండు, మూడు నెలల్లో ఇక్కడ లభించే అనుభవం ఎంతో విలువైనది. తర్వాత మా నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టడానికి తగిన సమయం ఉంటుంది’ అని ఈ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ విశ్లేషించాడు. అలాగే ఇటీవల సౌతాఫ్రికా, టీమిండియాతో ఆడిన టీ20ల్లో ఇంగ్లాండ్‌ అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లను ఆడించింది. దీంతో రాబోయే సిరీస్‌ల్లో అలా జరగదని, కేవలం పొట్టి ఫార్మాట్‌ ఆటగాళ్లతోనే ఆడతామని సూచనప్రాయంగా తెలిపాడు. ఇక ప్రపంచకప్‌ జట్టులో ఎవరుంటారు, ఎవరు ఉండరనే విషయాలు ఇప్పుడే చెప్పలేమని, రాబోయే రోజుల్లో ఎవరు బాగా ఆడితే వారికి అవకాశాలు లభిస్తాయన్నాడు.

Related posts