కరోనా వైరస్ తగ్గిన ప్రాంతాల్లో సాధారణ జీవనాన్ని తిరిగి నెలకొల్పాలని రాష్ట్రాల గవర్నర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. గురువారం వైట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుకాగా, దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మూడు సూత్రాల ప్రణాళికను అమలు చేయనున్నట్టు తెలిపారు.
మన జీవితాలను మనం తిరిగి ప్రారంభిస్తున్నామని, మన ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్సను ప్రారంభించాలన్నారు. ఇది ఒక్కరోజుతో అయ్యే పనికాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కొత్త నిబంధనల ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను సడలిస్తామని, అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
వైరస్ మరోసారి వ్యాపించకుండ, ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూనే ఉండాలని సూచించారు. సాధారణ జనజీవనం ఇప్పట్లో సాధ్యం కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్య బాధ్యత ఆ రాష్ట గవర్నర్ దేనని తెలిపారు. నిత్యమూ వారితో పరిస్థితిపై సమీక్షిస్తున్నామని అన్నారు. రాష్ట్రాల్లోని పరిస్థితిని బట్టి, అక్కడి గవర్నర్లే నిర్ణయాలు తీసుకోవచ్చని సూచించారు.

