telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్.పి.బాలు హాస్పిటల్ బిల్లు నేను కట్టలేదు : దీపా వెంకట్

Deepa-Venkat

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంతో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. అయితే ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ సరిగా జరగలేదని, డబ్బు కోసమే ఇన్నిరోజులు ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు బాలుని ఇబ్బంది పెట్టారని, బాలు మృతి వెనుక ఏదో పెద్ద కారణం ఉందని కొందరు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్ చేయడంతో జనాల్లో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. బాలుకు సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్‌ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. “దివంగత శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి వైద్య బిల్లుల చెల్లింపులు నేను చేసినట్లుగా వస్తున్న కొన్ని వాట్సప్ సందేశాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతుండడం బాధాకరం.. ఇది పూర్తిగా అవాస్తవం. వాటిని దయచేసి ఫార్వర్డ్ చేయవద్దని మనవి. రెండు వారాల క్రితం ఇంకేమీ చెల్లించనవసరం లేదని ఆసుపత్రి యజమాన్యం దివంగత శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి తెలియజేశారు. ఆస్పత్రి ఉత్తమ చికిత్సను అందించడమే గాక, వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నాకు, అదే విధంగా కొన్ని సార్లు మా తండ్రి గారికి సమాచారం ఇచ్చారు. శ్రీ బాలు గారు మా కుటుంబానికి దగ్గర వారైనందున మాకు ఈ విషయాలు తెలియజేశారు” అంటూ దీపా వెంకట్ చెప్పుకొచ్చారు.

కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌తో పాటు ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న ఆయన.. తిరిగి అనారోగ్యం పాలై సెప్టెంబర్ 25వ తేదీన ఒంటి గంట 4 నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

Related posts