telugu navyamedia
తెలుగు కవిత్వం వార్తలు సామాజిక

భగీరథ మానస పుత్రిక “నాగలాదేవి”

అక్షరాలు కుప్పపోస్తే పుస్తకమవుతుంది, వాక్యాలు పేరిస్తే కవిత్వమవుతుంది, అందులో గుండెను తట్టే అనుభూతి వుండదు.

అక్షరాలు కుప్పపోయడం వాక్యాలు పేర్చడం మంచి రచన లక్షణం కాదని గ్రహించిన అనుభవం పండిన ఓ రచయిత కలం నుండి జాలువారిన రసప్రవాహం ‘నాగలాదేవి’ చారిత్రక నవల.

“ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగునపడి కాన్పించని కథలన్నీ కావారిప్పుడు దాచేస్తే దాగనిసత్యం” – అంటాడు మహాకవి శ్రీశ్రీ.

16వ శతాబ్దానికి చెందిన ప్రేమకథను చరిత్ర పుటల్లోంచి వెలికితీసి, పరిశోధించి వాస్తవాలు నిగ్గుదేల్చి, కథానుగుణంగా కల్పనలు జతచేర్చి, వీర, శృంగార, అద్భుత, కరుణరసాత్మకంగా మలచిన రమణీయ రసమయ గాథ ‘నాగలాదేవి’ చరిత్ర.

ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత, కవి, చరిత్ర పరిశోధకులు ‘భగీరథ’ గారు ‘నాగలాదేవి’ నవలను రాసి చరిత్రలో శూన్యాన్ని భర్తీ చేశారు.

పరిపూర్ణ చారిత్రక నవలను పాఠకలోకానికి కానుకగా సమర్పించారు. గతంలో నోరి నరసింహశాస్త్రిగారు, అడవి బాపిరాజు గారు, కవిసమ్రాట్ విశ్వనాథ వారు, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు వంటి చారిత్రక నవలా రచయితల మార్గాన్ని మరింత సువిశాలం చేసి, చారిత్రక నవలకు మన భగీరథ గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

భగీరథ గారు పాత్రికేయ రంగానికి పాతకాపు. రచనారంగానికి సరికొత్త చూపు. ప్రకాశం జిల్లా నాగండ్ల నల్లరేగడి నేలలో మొలకెత్తిన వారి అక్షరం, పదమై, వాక్యమై పరిమళించింది. ‘నాగలాదేవి’ నవల ‘భగీరథ పథాన్ని’ పరిచయం చేసింది.

భగీరథ గారి కలం, గళం ‘మానవత’ను పలికించింది. భగీరథ గారి ‘శకపురుషుడు’,’తారకరామం’ ఇతర రచనలు వారి రచనా పాటవానికి, పరిశోధనా దృష్టికి ప్రతీకలుగా నిల్చాయి. ప్రఖ్యాత హేతువాది రావిపూడి వెంకటాద్రిగారు జన్మించిన నాగండలోనే పుట్టిన భగీరథ గారు పురిటిగడ్డకు పేరు తెచ్చారు.

స్త్రీని భోగవస్తువుగా చూసే దేశంలో మహిళను ప్రేమకు ప్రతిరూపంగా నిలిపింది ‘నాగలాదేవి’ నవల. రూపవతి, గుణవతి, అభిమానవతి అయిన నాగలాదేవిని భగీరథ గారు నవలలో కొత్త కోణంలో ఆవిష్కరించారు. వేశ్యలు వేశ్యలుగానే మిగిలిపోకుండా, రాజపూజితలై, రాణులై, కదనరంగ ప్రవీణులై, దాంపత్య జీవనంలో ధన్యలై, గుణగణ్యలై, రాజకీయ యంత్రాంగంలో రాణించి చరితార్థులయ్యారని చెప్పడానికి భగీరథగారి ‘నాగలాదేవి’ సరికొత్త భూమికగా నిలుస్తుంది.

ఈ నవల రచనకు రచయిత మూడు సంవత్సరాలు శ్రమించారు. అందుకు హంపి, విజయనగరంతోపాటు, రాయలవారి ఏలుబడిలోని వివిధ ప్రాంతాలు సందర్శించారు. చారిత్రకాధారుల సేకరించారు. శాసనాలు పరిశీలించారు. గ్రంథాలయాల్లోని చారిత్రక గ్రంథాలు చదివారు. మద్రాసు, హైదరాబాద్ లోని మాన్యు స్క్రిప్ట్స్ లైబ్రరీలకు వెళ్ళారు.

తాను సేకరించిన సమాచారాన్ని చరిత్రకు భంగం కలగనిరీతిలో అధ్యాయాలుగా విభజించుకొన్నారు. కల్పనలు జోడించారు. ప్రణాళికతో పాఠక జన హృదయరంజకంగా ప్రయోగాత్మకంగా, సామాజిక ప్రయోజనాత్మకంగా నవలనుదిద్ది తీర్చారు.

కవిత్వంరాయడం సులభం. చరిత్ర రచన కష్టం. కవిత్వం కల్పనలను స్వాగతిస్తుంది. చరిత్ర వక్రీకరణలను సహించదు. ‘నాగలాదేవి’ వక్రీకరణలు లేని నవల. వాస్తవాలు నిగుదేల్చిన నవల. సంఘటనాత్మకంగా, సన్నివేశాల కల్పనతో సాగిపోయే నవల. రచయిత మొత్తం కథను పాత్రల ద్వారా నడిపించడం ఈ నవలలోని విశేషం.

కథకు అనుగుణమైన భాషను సరళ సుబోథకంగా, కవితాత్మకమైన వచనశైలిలో భగీరథ గారు నవలను రాసిన తీరు పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తుంది. ఆనందపరవశుల్ని చేస్తుంది.

చరిత్ర పలు సదవగాహనకల్గిస్తుంది. ప్రేమకున్న పవిత్రతను, అపురూపత్యాగాన్ని చాటి, మన గుండెల్ని అర్ధం చేస్తుంది. ప్రేమ చుట్టూ అల్లిన రసమయకథ మనల్ని పుటవెంట పుట వేగంగా చదివింపజేస్తుంది. మనల్ని తన వెంట తీసుకువెళ్తుంది.

చిన్నాదేవిని (నాగలాదేవికి మరోపేరు) రాయలవారిని ప్రకాశంజిల్లా పంట పొలాలగట్ల మీద విహరింపచేసి, అద్భుతమైన ప్రేమసింహాసనంపై కూచోబెడుతుంది. నాగలాదేవి నవలలో కొన్ని చోట్ల శృంగార పరవశుల్ని చేస్తుంది. ఇంకొన్ని చోట్ల వీరరసస్ఫూర్తిని కల్గిస్తుంది. మరికొన్ని చోట్ల చిన్నాదేవిని స్వార్థత్యాగం, రాయలవారి కపటంలేని ప్రేమ కంటతడిపెట్టిస్తుంది.

ఇలా సలక్షణంగా రాయాలంటే రచయిత పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలి. తానే పాత్రలుగా మారాలి. కథను దృశ్యాత్మకంగా, నాటకీయ ప్రక్రియలో నడపాలి, ఈ నేర్పు భగీరథిగారికి పుష్కలంగా వున్నందునే ఇంత చక్కని నవలను మనకందించగలిగారు.

రచయిత కథానుగుణంగా పాత్రలను ప్రవేశపెట్టిన విధానం, పరిచయం చేసిన తీరు మహాకవి పెద్దనగారిని తలపింపచేస్తుంది. మనుచరిత్రలో “ఆపురిబాయకుండు, మకరాంక, శశాంక మనోజ్ణ మూరి”- అని ప్రవరుని పరిచయం చేస్తారు.

ఇదో నాటకీయ శిల్పం. భగీరథ గారికి ఆ శిల్ప సౌందర్యం బాగా తెలుసు. నాగలాదేవి రూపలావణ్యాన్ని వర్ణిస్తూ “అనిర్వచనీయమైన ప్రతిభ, అపురూపమైన అందం, అసామాన్యమైన పాలనాదక్షత, ఆమేయమైన వ్యూహరచన, సాటిలేని మానవతా హృదయం, సాహసానికి మారుపేరైన యుద్ధతంత్రనైపుణ్యం నాగలాదేవిని నారీమణిగా నిలిపాయంటారు.

270 పేజీల నవల్లో భగీరథ గారు వాడిన భావానుగుణమైన భాష, వారి నిర్మాణశైలి, సందర్భానుసారంగా ప్రయోగించిన పలుకుబడులు, జాతీయాలు చక్కని పదబంధాలు పాఠకుల్ని కన్నార్పకుండా నవల చదివేలాచేస్తాయి. కవితాత్మకమైన వచన శైలిలో, నవలను మూద్రించిన తీరు పాఠకుల హృదయాలను ఆకర్షిస్తుంది.

“మీనీడలోనే విశ్రమిస్తా మీ ఒడిలోనే నిష్ర్కమిస్తా!” – అనే నాగలాదేవి మాటల్లో నవల ఆద్యంతాల సారాంశం ఇమిడి వుంది.

“నా పేరు కృష్ణ. మాది చంద్రగిరి” – రాయలవారు.
“అలనాటి కృష్ణుడులా… ఈ గోపిక వేటకు రాలేదు గదా” – నాగలాదేవి.
“గోపికలు ఎంతమంది వున్నా రాధ తో సరితూగరుగా” – రాయలవారు
“అవును, ఇంతకు నేను తొలిసారి చూసింది ఈ రాధనే.. కాదు నాగలాదేవినే” – రాయలువారు.
“ఇది నిజమైన వలపా?
మోజుతో వేసే వల….పా?” – నాగలాదేవి.
ఇలాంటి రసభరిత చమత్కారాలతో నవలలో సంభాషణుల సాగిపోతాయి.

వర్ణనలు పాఠకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. భగీరథగారు పత్రికల్లో పనిచేసినందువలన భావానుగుణమైన భాషను సరళ మైన శైలిలో వాడారు. రచయిత పుట్టిపెరిగిన నాగండ్ల ప్రాంతపు ప్రజాజీవనం నవలలోని పలు సన్నివేశాల్లో ప్రతిబింబించింది.

నాగండ్ల, పావులూరు గ్రామాల సమీపంలో చింతలపాలెం వుంది. ఆ గ్రామంలో వెలమదొరలు గుర్రాలమీద ఇంకొల్లు వెళ్ళి వస్తుంటారు. ఈ దృశాన్ని చూసిన భగీరథగారు –
“మీరు ఎప్పుడూ గుర్రం మీద వస్తారా? మీరు మోతుబరులా?
గుర్రాలు వాళ్ళకేవుంటాయటగదా!” అని నాగలాదేవి చేత అమాయకంగా ప్రశ్నింపచేస్తారు. రాయలవారు చిరునవ్వుతో బదులిస్తారు.
నాగలాదేవిని చూశాక, రాయలవారికి నిద్రపట్టలేదు-ఆదృశ్యాన్ని
“రాయలువారికి పట్టుపరుపు పల్లేరుకాయలా గుచ్చుకుంటుంది” అని పల్లెటూరి పదసౌందర్యాన్ని కుప్పలుపోస్తారు రచయిత.

సన్నివేశానుగుణమైన భాషను వాడటం భగీరథ గారికి పెన్నుతో పెట్టిన విద్య. విశ్వనాథ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, యస్వీ భుజంగరాయశర్మ, నార్ల, నాగభైరవ వంటి వారు కవితాత్మక వచన రచనలో సిద్ధహస్తులు. భగీరథగారు ఆ మార్గంలోనే సాగి, పాఠకులకు ప్రమోదాన్ని రచనకు ప్రయోజనాన్ని కల్గించి, నవల స్థాయిని ఉన్నతశిఖరాలకు తీసుకువెళ్ళారు.

ఏ రచయితకైనా ప్రాంతీయాభిమానం వుంటుంది. ఆ ప్రాంతపు నాగరికత, జీవనవిధానం నవలలో ప్రతిబింబిస్తుంది. నాగలాదేవి భగీరథ గారి మానసపుత్రిక. నాగలాదేవిని నాగండ్ల అమ్మాయిగా మార్చేశారు. పసుపు పచ్చని లంగా, పూలరవికె, పల్చటి ఓణీ, కాటుక దిద్దిన కళ్ళు, ముత్యాలహారం, చెవులకు జూకాలు, చక్కటి ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన జడ” ఈ పల్లెటూరి పడుచును పట్టపురాణిని చేసి నవలకు పరిపూర్ణతనిచ్చారు.

నాగలాదేవి అందాలను, నవలలోని రసవద్ఘట్టాలను అపురూప చిత్రాలుగా వేసిన ప్రఖ్యాత చిత్రకారులు ప్రత్యేకంగా అభినందనీయులు. వీరనారిగా, ఖడ్గదారిగా నాగలాదేవి ముఖచిత్రం నవలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

‘నాగలాదేవి’ నవలను విషాదాంతం చేయడాన్ని కొందరు రచయితలు, విమర్శకులు తప్పుపట్టారు. ప్రేమత్యాగంతోనే ప్రకాశిస్తుంది. ప్రేమమూర్తి అయిన చిన్నాదేవి రాయలవారి అనురాగ మూర్తిగా, అంతరంగపు ఆరాధ్యగా ప్రేమను పునీతం చేసుకుని, రాజక్షేమం కోసం, కదనరంగంలోకి దూకి రాయలవారి ఒడిలో తుదిశ్వాస విడుస్తుంది. ఇది త్యాగమేకాని విషాదంకాదు. ప్రేమతో ప్రారంభమై శృంగారంతో మలుపులు తిరిగి, వీరత్వప్రదర్శనతో పరిపూర్ణత్వం సాధించి, కరుణరసాత్మకంగా నవల ముగియడం శాస్త్రీయమేతప్ప, అశాస్త్రీయంకాదు.

నాగలాదేవి రాయలవారి ఒడిలో విశ్రమించే దృశ్యం మనల్ని కంటతడిపెట్టిస్తుంది. దుఃఖం పెల్లుబుకుతుంది. చిన్నాదేవిని చూసిన రాయలువారిలాగే మనమూ బోరున విలపిస్తాం. ఇంత గొప్పగా సన్నివేశకల్పన చేసిన భగీరథ గారిని అభినందించకుండా ఉండలేం. (పుటలు 269, 270).

“కృష్ణదేవరాయల గురించి అనేక మంది పుస్తకాలు రాశారు. కానీ చిన్నాదేవి ప్రేమకథను ఎవరూ రాయలేదు. నాగలాదేవి ప్రేమ పూర్తి త్యాగమైన గాథను నవలగా రాయాలనే పట్టుదల నాచేత ఇలా రాయించింది. ఈ చరిత్ర ఇలాగే జరిగిందని చెప్పలేను. కానీ జరగడానికి అవకాశముందని మాత్రం చెప్పగలను. ఈ నవల కల్పనలతోపాటు చారిత్రక ఘటనలతో సమాంతరంగా నడిచే ఓ ఉత్తేజకరమైన ప్రేమకథ.

నవల చదివాక మీరుకూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు” – అన్న భగీరథ గారి మాటలు పాఠకులకు పఠనాసక్తిని కల్పిస్తాయి.

పూర్వ ఉపరాష్ట్రపతి యం. వెంకయ్యనాయుడుగారు, రిటైర్డ్ ఐ.ఏ.యస్. అధికారి సాహితీ వేత్త డా. కె.వి. రమణాచారి, ప్రఖ్యాత హేతువాది రావిపూడి వెంకటాద్రి గార్ల ముందు మాటలు నవలకు బంగారు కిరీటాలు. ప్రేమ, త్యాగం గుబాళించే ‘నాగలాదేవి’ నవలను ప్రేమ మూర్తులైన గుమ్మడిల్లి వెంకాయమ్మ (రచయి తల్లిగారు), చెరుకూరి సీతమ్మ (రచయితను పెంచిన తల్లి చిన్నమ్మ) గార్లకు అంకితం ఇవ్వడం భగీరథగారి నిలువెత్తు సంస్కారానికి నిదర్శనం.

పాఠకులు తప్పక చదవవలసిన నవల ఇది. సినిమాగా తీయవలసిన చారిత్రక గాథ యిది.
– డా. బీరం సుందరరావు, చీరాల

Related posts