telugu navyamedia
సినిమా వార్తలు

సినీ ఇండస్ట్రీలో మ‌రో విషాదం : ప్రముఖ ఎడిటర్‌ గౌతంరాజు కన్నుమూత..

తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు(68) కన్ను మూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు.

ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. సుమారు 800 పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశారు. ‘ఆది’, ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’, ‘అదుర్స్‌’, ‘బలుపు’, ‘రచ్చ’, ‘ఊసరవెల్లి’, ‘బద్రీనాథ్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘కాటమరాయుడు’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన పనిచేశారు

‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో గౌతమ్‌రాజు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును అందుకున్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ ఎడిటర్‌గా గౌతమ్ రాజు చివరి చిత్రమని చెప్పాలి. ప్రస్తుతం ‘శాసన సభ’ అనే చిత్రానికి ఆయన పని చేస్తున్నప్పటికీ… ఆ సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. 

గౌతంరాజు 1982లో నాలుగు స్తంభాలాట చిత్రంతో ఎడిటర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన 1954 జనవరి 15న ఏపీలోని ఒంగోలులో రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు.

గౌతమ్ రాజుకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అమ్మాయి హైదరాబాద్, నిజాం పేటలో నివాసం ఉంటున్నారు. చిన్నమ్మాయి అమెరికాలో ఉంటున్నారు. తండ్రికి అనారోగ్యంగా ఉందని తెలిసిన వెంటనే చిన్నమ్మాయి ఇండియా వచ్చారు.

మోతీనగర్‌లోని గౌతమ్ రాజు నివాసం వద్ద ఆయన పార్ధీవ దేహం ఉంది. పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు

Related posts