ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బిహార్ కు చేపలు, రొయ్యల దిగుమతిపై గతంలో విధించిన దిగుమతిపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. ఏపీ నుంచి దిగుమతి అవుతున్న చేపలు, రొయ్యల్లో ప్రమాదకరమైన ఫార్మాలిన్ అనే రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తనిఖీల్లో తేలడంతో బిహార్ ఏపీ సముద్ర ఉత్పత్తులపై గతంలో నిషేధం విధించింది. సముద్ర ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్ వాడుతున్నారన్న ఆరోపణలతో ఎగుమతులు నిలిపివేశారని లేఖలో చంద్రబాబు వివరించారు.
తమ ఉత్పత్తుల్లో ఫార్మాలిన్ వాడటం లేదని స్పష్టం చేశారు. రొయ్యలు, చేపల ఉత్పత్తుల తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఏపీ సముద్ర ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే బిహార్ నుంచి అధికారుల బృందాన్ని పంపించి తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. వెంటనే ఎగుమతులను పునరుద్ధరించాలని నితీష్‌కుమార్‌ను చంద్రబాబు కోరారు.