telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యట విజయవంతం

ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో యూఏఈ ప్రభుత్వ మంత్రులు, ప్రముఖ వాణిజ్య సంస్థల అధిపతులతో జరిపిన వరుస సమావేశాలు ఫలవంతమయ్యాయి.

ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించి, రాష్ట్రంలో భాగస్వాములు కావాలని వారిని చంద్రబాబు ఆహ్వానించారు.

పర్యటన చివరి రోజైన శుక్రవారం ముఖ్యమంత్రి.. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులతో పాటు ఇరుపక్షాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పాలన, పౌరసేవలను మెరుగుపరిచేందుకు ఏపీకి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు.

ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్-దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య భాగస్వామ్యానికి ఇరు ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి.

ఆహార భద్రత విషయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు యూఏఈ ఆర్థిక మంత్రి ఆసక్తి చూపారు.

అనంతరం యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ జియౌదితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, పెట్రో కెమికల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చించారు.

ముఖ్యంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టే అంశంపై మంత్రి థానీ ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆస్టర్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజాద్ మూపెన్‌కు తెలిపారు.

ఏపీలో అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు స్థాపించాలని ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

అదేవిధంగా, టెక్స్‌టైల్‌, రిటైల్ రంగాల్లో పెట్టుబడుల కోసం అపారెల్ గ్రూప్ సీఈఓ నీలేశ్ వేద్‌తో చర్చించారు. ఏపీలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Related posts