telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించినప్పుడు తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆయన మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరు అందించే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదని స్పష్టం చేశారు. ఎగువ నుంచి విడుదల చేసిన నీటిని పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తరలించి వాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు.

పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకోవచ్చని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశలను తాము నిలబెట్టామని, వారిలో విశ్వాసాన్ని కల్పించామని ఆయన అన్నారు. 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు.

విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామని అన్నారు. సూపర్‌సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగవంతం చేసినట్లు తెలిపారు.

ఈ సంవత్సరం కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా లబ్ధి పొందిన వివరాలను ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామని అన్నారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్టు అని, అది పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడలేదని అన్నారు.

Related posts